పంచేంద్రియాలను కదిలించే కథలు.. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన హవ్వ కథలు

పంచేంద్రియాలను కదిలించే కథలు.. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన హవ్వ కథలు

తెలుగు పాత్రికేయ, సాహిత్య రంగాల్లో పరిచయం అక్కర్లేని పేరు సతీష్​ చందర్​. కవి, రచయిత, పత్రికా సంపాదకులుగా ప్రసిద్ధులు. వృత్తి, ప్రవృత్తిలో అపార ప్రజ్ఞాశాలి. రెండింటిలోనూ  వ్యంగ్యం, హాస్యం ఆయన శైలికి ప్రధాన ఆయుధాలు. పాత్రికేయుడిగా సమకాలీన రాజకీయం, రాజకీయ నాయకుల తీరుపై ఆయన  ఎన్నో వ్యాసాలు, సంపాదకీయాలు రాశారు. వాటిల్లోని చెణుకులు పాఠకులను నవ్విస్తూనే చైతన్యవంతం చేస్తే, నాయకులను భుజాలు తడుముకునేలా చేశాయి. 

ఇక, సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేశారు. కవిత్వం, నాటకంతోపాటు ఎన్నో కథలు, నవలలు, సాహిత్య విమర్శలు రాశారు. కథా సంకలనాలు  వెలువరించారు. ఈ వరుసలో వచ్చిన ఆరో సంకలనం  ‘హవ్వ–ఇతర కథలు. ఈ పుస్తకంలో ఆణిముత్యాల్లాంటి 14  కథలున్నాయి. వీటిలో అధిక భాగం ఇప్పటికే వివిధ పత్రికల్లో, ఇతర మాధ్యమాల్లో వచ్చి ఆదరణ పొందాయి. 

‘హవ్వ’ కథల్లో హృదయాన్ని కదిలించే గుణం ఎక్కువ. రచయిత సహజశైలి అయిన వ్యంగ్యం, హాస్యం తళుక్కుమంటూనే, వీటి కంటే ఎక్కువగా గుండెను మెలిపెట్టే, కళ్లను తడిచేసే ఆర్ద్రత కనిపిస్తుంది. ఈ కథలన్నీ ఆర్థిక, సామాజిక అసమానతలు కేంద్రంగా బంధాల చుట్టూ అల్లుకున్నవి. ముఖ్యంగా దళితవాడలు, కాలనీల్లోని సమస్యలతోపాటు మహిళల ఆవేదనకు ప్రతిరూపాలివి. చదువుతున్నంతసేపు, చదివాక కళ్లకు కన్నీళ్ల జోడును అమర్చే/మిగిల్చే కథలివి. 

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినవాళ్లకు, బతుకుదెరువుకు పరాయిదేశాలకు వెళ్లినవాళ్లకు తమ కుటుంబ సభ్యుల మీద ప్రేమాభిమానాలను ఆర్థిక స్థితిగతులు ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే ‘బెంగ’ కథ.. సంకలనంలో కన్నీళ్ల ప్రయాణానికి ట్రైలర్​. మనసులు కలిపిన ప్రేమ అరవయ్యేళ్లయినా మర్చిపోలేమని ‘నిద్ర గన్నేరు చెట్టు’ చెబితే.. అందం చూసి పుట్టే ప్రేమ వెనక అనుమానం, అవమానం పొంచి ఉంటాయని, అవి మనుషుల్ని, మనసుల్ని బందీలను చేస్తాయని ‘ముల్లు’, ‘యువర్​ ఆనర్’​ కథలు చెబుతాయి. ఈ మూడు కథల ముగింపూ కన్నీరు తెప్పించినా, చిత్రంగా అది బాధ పెట్టదు. ‘ముల్లు’ కథలో తల్లీకూతుళ్ల పాత్రల చిత్రీకరణ, వాళ్ల మధ్య అనుబంధం, మాటలతో పాఠకులు ప్రేమలో పడిపోతారు.

బతకడం కోసం బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు నాటకమాడే ‘స్పర్శ’ కథలో మలినంలేని ప్రేమ కనిపిస్తే..‘తోడు చుక్కలు’, ‘చతుర్ముఖుడు’ స్వచ్ఛమైన స్నేహాన్ని కురిపిస్తాయి. చెల్లెల్ని ప్రాణంలా చూసుకునే ఇద్దరు దొంగల కథ చదువుతుంటే కన్నీళ్లు ‘గుక్క’ తిప్పుకోనీవు. ఆరంభం నుంచే నవ్వుల జల్లు కురిపించే‘లాస్ట్​ షో’ చివరాఖరికి వచ్చేసరికి గొంతు గద్గదం చేస్తుంది. 

కొన్ని బతుకులు భూమి మాదిరే గుండ్రంగా ఉంటాయని, అవి బయలుదేరిన చోటుకు తిరిగి వస్తాయని చెప్పే ‘చంద్రమ్మవ్రాలు’; మొగలిపొదల్లో నాగుపాములున్నట్లే కొన్ని ‘సెంట్​’ల వెనక కాటువేసే ‘సర్పెంట్​’లు ఉంటాయని చెప్పే ‘నన్​’; ఆకాశమంత ప్రేమను కష్టంగా అయినా ఇష్టంగా భరించాలంటూ చెప్పే ‘కారాగృహం’; అందానికే కాదు బతకాలంటే కొన్ని రకాల అంధ విశ్వాసాలకూ మేకప్​ అవసరమని చెప్పే ‘మేకప్​’ కథ.. వేటికవే సాటి. ఇక ఆఖరు కథ ‘హవ్వ’ చదివాక పుస్తకం పేరుకు, కవర్​ పేజీ బొమ్మకు మధ్య సంబంధం తెలుసుకొని పాఠకుడు షాక్​కు గురవ్వడం ఖాయం!  

పుస్తకంలోని ప్రతి కథ ప్రారంభం ఒక మెరుపు. అది మిగిలిన కథలోకి వెలుగు దారి పరిచి చకచకా తీసుకెళుతుంది. ‘నిద్ర పోతేనే కదా కల వచ్చేదీ..  మళ్లీ ఆ కలలోనే నిద్రపోతే?!’ , ‘విసుగు వచ్చింది. కానీ విసగలేకపోయింది రోజమ్మ’, ‘మత్తు నిద్ర వేరు. ఉత్త నిద్ర వేరు’ , ‘అమ్మను సంపుకుంటానా?’, ‘నాన్న బూడిదయ్యాడు: అది అప్పుడు; బూడిదే నాన్నయ్యాడు: ఇది ఇప్పుడు’.. ఈ ఉదాహరణలు ఆ మెరుపుల్లో కొన్ని. ఇక కథాగమనంలో వచ్చే చిన్న చిన్న పదాలు, వాక్యాల విరుపులకు, సొబగులకు , వాటిలోని భావానికి గులాం అనాల్సిందే. అవి పాఠకుడి కళ్లు పట్టుకొని కథ సాంతం ఏకబిగిన నడిపిస్తాయి. ముగింపులూ మెప్పిస్తాయి. 

సాహిత్య పరిశోధకులు, ఔత్సాహిక రచయితలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తం. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవొచ్చు. సాహిత్యాభిమానులు  తమ లైబ్రరీలో, గుండె గదుల్లో దాచుకోవచ్చు. రచయిత అభిప్రాయం ప్రకారం ఇవి పంచేంద్రియాల ఎరుకను చెప్పే కథలు. వీటి గురించి ఆయన  శైలిలో నాలుగు ముక్కల్లో చెప్పాలంటే ‘చురుక్కు, చమక్కు, కిసుక్కు, కసుక్కు’. లోకం పోకడ, మనుషుల తీరు గురించి చురుక్కుమనిపిస్తూ; పదాలు, వాక్యాలు, శైలితో చమక్కులు చేస్తూ; కిసుక్కున నవ్విస్తూ, కసుక్కున గుండెల్లో గుచ్చి కన్నీళ్లు తెప్పించే కథలివి.

- జి. మహేశ్వర్​

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com